Online Puja Services

లక్ష్మీ అనుగ్రహాన్ని అపరిమితంగా అందించే ఆషాడ శుక్రవారాలు!

18.118.50.214

లక్ష్మీ అనుగ్రహాన్ని అపరిమితంగా అందించే ఆషాడ శుక్రవారాలు!
లక్ష్మీ  రమణ

 ఆషాడ మాసం పేరు వినగానే, కొత్త కోడళ్ళు సంబర పడతారు, ఎంచక్కా నెలనాళ్ళు పుట్టింటికి వెళ్లొచ్చని .  పండుగలు ఏమీ లేని మాసం కనుక అల్లుళ్ళకి పెద్దగా గిట్టుబాటు అయ్యే మాసమేమీ కాదు. పైగా వ్యవసాయపనులు దండిగా ఉండడంతో బోలెడంత శ్రమాధిక్యాన్నిచ్చే మాసం కూడా ! కానీ ఈ నెలలో పర్వదినాలు లేవనే మాట ఉత్తిదే. చూడండి , ఒకవైపు వారాహీ నవరాత్రులు లేదా ఆషాడ నవరాత్రులు ఈ నెలలోనే ఉంటాయికదా ! అలాగే ఆషాడ లక్ష్మీ పూజలు కూడా ! శ్రావణ మాసంలాగానే , ఆషాడ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం అత్యంత శుభదినం .  ఆరోజు ఇలా లక్ష్మీ దేవిని పూజించారంటే, అమ్మవారి అనుగ్రహానికి కొదవుండదు . 

ఆషాడమాసంలో వానలు పడుతూ ఉంటాయి .  కాళ్ళకి , గుమ్మలకీ విధిగా పసుపుని రాయడం ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాదు , సస్యలక్ష్మికి, ధనలక్ష్మికీ అది ఆహ్వానం కూడా ! ఆషాడ మాసంలో అప్పటివరకూ సృష్టి పోషణలో అలిసిన విష్ణుభగవానులవారు కాస్తంత విశ్రాంతి తీసుకుంటారట .  మరి అయ్యవారు విశ్రాంతిగా ఉంటె , జగత్ పోషణా భారం ఎవరు తీసుకుంటారు , అమ్మే కదా ! ఒక వంక అయ్యవారి పాదాలు సుతి  మెత్తగా ఒత్తుతూనే , ఓరకంట తన బిడ్డల పోషణా భారాన్ని ఆ దేవీ వహిస్తుంది . అందుకే ఆషాడ లక్ష్మీ వ్రతానికి , శాక వ్రతమని పేరు.  అమ్మ శాకాంబరిగా  అనుగ్రహిస్తుందని   ఈ పేరుతోనే చెప్పడం లేదూ !

ఈ పూజకి కూడా గుప్త / ఆషాడ  నవరాత్రుల్లాగా, హంగూ ఆర్భాటాలేమీ అవసరం లేదు .  వ్యక్తిగత , పరిసరాల శుభ్రతని పాటించి అమ్మవారికి చక్కగా నెయ్యి లేదా నువ్వుల నూనె తో దీపం పెట్టుకోండి .  అమ్మవారిని అష్టలక్ష్మీ దేవిగా ఎనిమిది రూపాల్లో భావన చేసి ఆరాధించండి. లఘువుగా అష్ట లక్ష్మీ స్తోత్రం , లక్ష్మీ అష్టోత్తరం చేసుకొని చక్కగా  క్షీరాన్నాన్ని నివేదించండి .  ఓపిక ఉన్నవారు లక్ష్మీ సహస్రనామాలు చేసుకోవచ్చు . ఇలా ఆషాఢమాసంలో ప్రతి శుక్రవారం చేసుకోవాలి .  ఇంట్లో సహృద్భావ వాతావరణం ఉండేలా చూసుకోండి . 

అలాగే, ఆషాడమాసంలో వచ్చే అమావాస్య అత్యంత ప్రభావవంతమైనది.  ఈ తిధి ఉన్న రోజు తప్పకుండా పితృదేవతలకు తర్పణాలు వదలండి . సూర్యునికి అర్ఘ్యాన్ని అర్పించండి . నారాయణుడు పితృదేవతల స్వరూపం. ఇక ఆ నారాయణుడే సూర్యమండలంలో ఉంది నిత్యమూ మనని అనుగ్రహించే ఆదిత్యుడు. ఆయన హృదయేశ్వరి లక్ష్మీ దేవి .  ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి . కనుక పెద్దలకి తర్పణాలు వదలడం తప్పకుండా చేయాలి . ఇలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది . లక్ష్మీ అనుగ్రహం అంటే లక్ష్యమైనవన్నీ సిద్ధించినట్టే కదా ! శుభం భూయాత్ !!

 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi